కృష్ణపట్నం(Krishnapatnam) పోర్టు సమీపంలోని భూములను తాజాగా రిలయన్స్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ సీఎండీ అనిల్ అంబానీ(Anil Ambani) పరిశీలించారు. దీంతో అక్కడ భారీ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడబోతున్నాయని తెలుస్తోంది. సోలార్ ప్యానెల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. 2026 నాటికి పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. అక్కడ పరిశ్రమ ఏర్పాటైతే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
కాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్‌కు 2008లో అప్పటి ప్రభుత్వం 2,565 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే అనివార్య కారణాలలో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. 2019 వరకు అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో వైసీపీ ప్రభుత్వం భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు కోర్టుకు వెళ్లడంతో పాటు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు అనిల్ అంబానీ భూముల పరిశీలనకు రావడంతో అల్ట్రా పవర్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు భావిస్తున్నారు.