ఆన్‌లైన్ బెట్టింగ్(Online Betting)కు బానిసై ఎంతో మంది యువత తమ సర్వస్వం కోల్పోతున్నారు. మరికొంత మంది అయితే అప్పులు తీర్చలేక ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా యువతను ఈజీ మనీ కోసం బెట్టింగ్‌కు అలవాటు చేసేలా కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రేరేపిస్తున్నారు. ఇందుకోసం రకరకాల వీడియోలు చేస్తూ వారిని ఆకర్షించి బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. తాజాగా ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ స్కాంపై అవగాహన కల్పించేలా ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ(TGSRTC) ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) ఓ పోస్ట్ పెట్టారు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండని అప్రమత్తం చేశారు.
“చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో.. అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి? ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి” ఆయన సూచించారు.