హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు కౌశిక్ రెడ్ఢి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు సహా నాలుగు పథకాలకు అర్హుల జాబితాను చదువుతున్న మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తౌటం ఝాన్సీరాణి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని.. కట్టిన ఇళ్లను కూడా లబ్దిదారులకు అందించలేదని ఆరోపించారు.
దీంతో కౌశిక్ రెడ్డి ఆమెను అడ్డుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అనుచరులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలుచున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కౌశిక్ రెడ్డికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించడంతో గ్రామసభ యథావిధిగా జరిగింది.