నాలుగు రోజులుగా సాగిన ఐటీ సోదాల(IT Raids)పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) మీడియాతో మాట్లాడారు. కోట్లలో వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ రైడ్స్ సాధారణంగా జరుగుతుంటాయని తెలిపారు. తనతో పాటు సినీ, వ్యాపార ప్రముఖులపైనా సోదాలు జరిగాయన్నారు. 2008లో ఒకసారి ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసిందని గుర్తుచేశారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు తమ ఇళ్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు. తమ సంస్థలకు సంబంధించిన అకౌంట్స్ బుక్స్ చూసి అధికారులే ఆశ్చర్యపోయారని అకౌంట్స్ అన్నీ క్లియర్ గా ఉన్నాయని చెప్పారన్నారు.
అధికారుల సోదాల్లో తన దగ్గర రూ.5 లక్షలు, శిరీష్ దగ్గర రూ.4.50లక్షలు, కూతురింట్లో రూ.6 లక్షలు, ఆఫీస్‌లో రూ.రెండున్నర లక్షలు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇలా మొత్తం సుమారు రూ.20 లక్షల కంటే తక్కువే డబ్బు ఉందని అది కూడా అనధికార డబ్బు కాదని వివరించారు. ఈ దాడుల్లో ఇంత డబ్బు దొరికింది.. ఏవేవో డాక్యుమెంట్లు దొరికాయంటూ కొన్ని ఛానల్స్‌లో వార్తలు ప్రచారం చేశారని.. అలాంటిది ఏం లేదన్నారు.
ఐటీ దాడులతో తన తల్లికి గుండెపోటు వచ్చిందని ప్రసారం చేశారని విమర్శించారు. తన తల్లి వయసు 81 ఏళ్లని, ఈ నెల 19న ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స అందించామన్నారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. దయచేసి పుకార్లు ప్రచారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.