Saturday, April 19, 2025
Homeట్రేడింగ్Future City: ఫ్యూచర్ సిటీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు

Future City: ఫ్యూచర్ సిటీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు

కొత్త సిటీ ఫ్యూచర్ సిటీ

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ తర్వాత నాలుగో నగరంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సింగపూర్, దావోస్ పర్యటనలో భాగంగా అమెజాన్, ఇన్ఫోసిస్, బ్లాక్ స్టోన్, కంట్రోల్ ఎస్ లాంటి గ్లోబల్ సంస్థలు తమ డేటా సెంటర్లను ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేసేందుకు వేల కోట్ల పెట్టుబడులతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఇప్పటికే ఫాక్స్‌కాన్, కాగ్ని‌జెంట్, స్టాన్‌ఫోర్డ్ శాటిలైట్ సెంటర్, వివింట్ ఫార్మా, కార్నింగ్ కెమిస్ట్రీ, జోయిటిస్, హెచ్‌సీఏ హెల్త్‌కేర్ కంపెనీలు రూ.31,352 కోట్లు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం.

- Advertisement -

14,000 ఎకరాల్లో

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ప్రాంతాల్లో ఫోర్త్‌ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం వద్ద 14 వేల ఎకరాల భూమి ఉంది. అదనంగా 16 వేల ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి మొత్తం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తోంది. దాదాపు 14 వేల ఎకరాల్లో ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, పర్యాటకం ఇలా నాలుగు జోన్లు ఒక్కోటి దాదాపు 3 వేల ఎకరాలతో ప్రత్యేక కారిడార్లుగా రూపొందించారు. అభివృద్ధిని పర్యావరణంతో మిళితం చేసేలా ముచ్చెర్ల ఏరియాలో ఫార్మా రీసెర్చ్ సెంటర్లు రాబోతున్నాయి. కందుకూరు వైపు పర్యావరణానికి పెద్దపీట వేస్తూ పార్కులు, ఎకో టూరిజం హబ్, నివాస స్థలాలు లాంటివి ఉండబోతున్నాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాకుండా పది వరుసల రహదారి నిర్మాణం, ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా ట్రిపుల్ ఆర్ వరకు 320 ఫీట్లతో 42 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్లు ఏర్పాటు కానున్నాయి. ఖర్చు తగ్గేలా రోడ్లకు ఆనుకొని మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ స్థాయి రేస్ క్లబ్, గోల్ఫ్ కోర్సులు లాంటివి ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఫోర్త్ సిటీ నీటి అవసరాలను తీర్చేలా కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు, మూసీ పునరుజ్జీవం లాంటివి సైతం ఉండబోతున్నాయి.

ఇప్పటికే రూ.31,352 కోట్ల పెట్టుబడులు
ఇటీవల సీఎం, ఐటీ మంత్రి బృందం అమెరికా, సౌత్ కొరియా పర్యటనల్లో దిగ్గజ ఫాక్స్‌కాన్, కాగ్ని‌జెంట్, స్టాన్‌ఫోర్డ్ శాటిలైట్ సెంటర్, వివింట్ ఫార్మా, కార్నింగ్ కెమిస్ట్రీ, జోయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్ ఇలా అనేక కంపెనీలను తెలంగాణలోని ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. దాదాపు రూ.31,352 కోట్ల పెట్టుబడులతో ప్రారంభ దశలోనే సుమారు 30,750 ఉద్యోగాలు కల్పించనున్నారు. యువతలో నైపుణ్యాలు పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ లాంటి అంశాల్లో ఎంపిక చేసిన విద్యాలయాల్లో పైలట్ స్కిల్ డెవలప్​మెంట్​ ప్రాజెక్ట్ అమలు, ఐటీఐల అప్​గ్రేడ్, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు లాంటివి అందులో భాగమే.

దావోస్‌లో పెట్టుబడుల జోరు
దావోస్‌లో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించి రేవంత్ సర్కార్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 20 దిగ్గజ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా రాష్ట్రంలో 49,500కి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, ట్రిపుల్ ఆర్‌ నిర్మాణం, మెట్రో విస్తరణ ప్రణాళికలు.. ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్‌ 2050 విజన్‌’ (Rising Telangana) పెట్టుబడిదారులను ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి పెట్టుబడులు సాధించింది.

దావోస్ ఒప్పందాలతో

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో చేసుకున్న ఒప్పందాల్లో ఎక్కువ భాగం డేటా కేంద్రాలే ఉండటం, ఇవన్నీ ఏఐ ఆధారిత సెంటర్లు కావడం విశేషం. ఒక్క డేటా సెంటర్లలోనే రూ.98 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. అమెజాన్, ఇన్ఫోసిస్, బ్లాక్‌స్టోన్, కంట్రోల్ ఎస్ లాంటి గ్లోబల్ సంస్థలు డేటా సెంటర్లను ఫ్యూచర్ సిటీలో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ పోచారంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమైంది. మరోవైపు హైటెక్ సిటీ కంట్రోల్ ఎస్ సంస్థ మరో క్యాంపస్‌ను విస్తరించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News