వైసీపీకి కీలక నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజకీయాలకు సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి ఈరోజు వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందించారు. అయితే విజయసాయి రాజకీయ సన్యాసంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. ఇది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత సమస్య అని అన్నారు. దీనితో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. దీనిపై అంతకు మించి తాము స్పందించనని పేర్కొన్నారు.
మరోవైపు సింగపూర్ వాళ్లకు కూడా జగన్ ప్రభుత్వం విధ్వంసం చూపించిందని.. అందువలనే వాళ్ళు రావడానికి విముఖత చూపించారని తెలిపారు. ఏపీ అంటే గ్లోబల్‌గా అసహ్యం వేసే పరిస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు వస్తే ఇటువంటి పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ఏపీకి హైదరాబాద్ లేదు అని రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు.. తాను హైదరాబాద్ ను తెలుగు కమ్యూనిటీ కోసం డెవలప్ చేశానని.. దీని గురించి ఎవరు ఎలా చెప్పుకున్నా పర్వాలేదని తెలిపారు.
హైదరాబాద్‌ను గతంలో అలానే డెవలప్ చేశానని.. అక్కడే తన తరువాత వచ్చిన వాళ్ళు హైటెక్ సిటీని ఎవరూ కూల్చలేదన్నారు. ఏపీలో ప్రజలు వచ్చి తనను కలిసే ప్రజా వేదికను కూల్చేశారని… ఆ తరువాత కూడా విధ్వంసం జరిగిందన్నారు. వ్యవస్థలు కూడా విధ్వంసం జరిగాయన్నారు. రాజధాని లేకుండా చేసి మూడు ముక్కలు ఆట ఆడారని మండిపడ్డారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు వచ్చే విమానాలు కూడా తగ్గిపోయాయని తెలిపారు. వారికి ఇచ్చే రాయితీలు కూడా జగన్ ఆపారన్నారు. మళ్ళీ వీటన్నిటినీ సరిదిద్దుతున్నామని తెలిపారు. మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నానని చెప్పారు.