పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణకు పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. తెలంగాణ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్నలను గుర్తించకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని సీఎం పేర్కొన్నారు.
139 మందికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీసం అయిదు పురస్కారాలు ప్రకటించకపోవడంపై సీఎం ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.