Friday, January 31, 2025
Homeపాలిటిక్స్CM Revanth: రాష్ట్రాలు, రాజ్యాంగంపై కేంద్రం దాడి చేస్తోంది: సీఎం రేవంత్

CM Revanth: రాష్ట్రాలు, రాజ్యాంగంపై కేంద్రం దాడి చేస్తోంది: సీఎం రేవంత్

నిరసనకు దిగుతామని కేంద్రానికి హెచ్చరిక

యూజీసీ నిబంధనలు మార్చి రాష్ట్రాల పరిధి నుంచి యూనివర్సిటీలపై అధికారాలను తప్పించాలని కుట్రలు చేస్తుని, విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనక ఒక పెద్ద కుట్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

యూనివర్సిటీల ద్వారా రాజకీయాలు

యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొంతమంది చేసే విషప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు కాబోతున్నాయని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి కేంద్రం యూజీసీ నిబంధనలు మార్చాలనుకోవడం రాజ్యాంగంపై దాడి చేయడమేనని మండిపడ్డారు. ఇది రాష్ట్రాలపై సాంస్కృతిక దాడి చేయడమేనని, ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. కేంద్రం చేసే ఇలాంటి అనవసర చర్యలు వివాదాలకు దారితీస్తాయని హెచ్చరించిన సీఎం, రాష్ట్రాల అధికారాన్ని కేంద్రం గుంజుకోవడం మాపై దాడిగానే భావిస్తామన్నారు. రాష్ట్ర హక్కులను వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమన్నారు. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి, అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు వెనకాడమని హెచ్చరించారు. రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రం తీసుకుంటూ వెళితే రాష్ట్రాలు కేవలం పన్నుల వసూలు చేసే సంస్థలుగా మిగలాల్సి వస్తాయని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా మేధావులు ఆలోచన చేయాలన్నారు.

ఆ చర్చ రావటమే దురదృష్టం

డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తంచేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం సర్టిఫికెట్ల కోసం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా ఆనాడు పీవీ నరసింహారావు యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లారని సీఎం గుర్తుచేశారు.

వందేళ్ల తరువాత దళిత వీసీ

సమాజంలో సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం మొదలు కావాలన్న సీఎం, విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించామన్నారు. వందేళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించామన్నారు.

సమాజానికి చికిత్స ఇవ్వండి

యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించామన్న సీఎం రేవంత్, తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉందన్నారు. పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలంటూ పిలుపునిచ్చారు. వాటి అమలు బాధ్యత తాము తీసుకుంటామన్నారు. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేస్తే అది మంచిది కాదన్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలని, దేశానికి పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి లాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీలదేనన్నారు.

రంగుల గోడలు అద్దాల మేడలు అభివృద్ధి కాదని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారన్న ఆయన, చిట్టచివరి పేదల వరకు సంక్షేమ ఫలాలు అందాలన్న అంబేద్కర్ ఆశయంతో మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News