ముల్తాన్ వేదికగా పాకిస్థాన్(Pakistan)తో జరిగిన రెండో టెస్టులో (PAK vs WI) వెస్టిండీస్ ఆటగాళ్లు అదరగొట్టారు. సమిష్టిగా రాణించి 120 పరుగుల తేడాతో విజయం సాధించారు. 254 పరుగుల ఛేదనలో 76/4తో సోమవారం ఆటను ప్రారంభించిన పాకిస్థాన్.. 133 పరుగులకే కుప్పకూలింది. బాబర్ అజామ్ (31), మహ్మద్ రిజ్వాన్ (25), కమ్రాన్ గులాం (19), సౌద్ షకీల్ (13), సల్మాన్ ఆఘా (15) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ (5/35), కెవిన్ సింక్లైర్ (3/61), గుడాకేష్ మోటీ (2/35) పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో 38/7 పీకల్లోతు కష్టాల్లో ఉన్న విండీస్ జట్టును మోటీ (55), కెమర్ రోచ్ (25), వారికన్ (36)లు ఆదుకున్నారు. దీంతో ఆ జట్టు 163 పరుగులు చేసింది. అనంతరం పాక్ 154 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 244 పరుగులు చేసింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయింది. కాగా పాకిస్థాన్ గడ్డపై కరేబియన్ జట్టు (West Indies) 35 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం విశేషం. చివరగా 1990లో ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో పాకిస్థాన్‌పై గెలిచింది. ఆ తర్వాత 1997, 2006లో పాక్ పర్యటనకు వెళ్లినా ఒక్క విజయం కూడా సాధించలేదు.