టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర చేపట్టి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పేరుతో లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్నారు.
“యువగళం పాదయాత్ర నాకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకం. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాలు మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీలు సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లు. నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి చెయ్యని ప్రయత్నం లేదు. మైక్ వెహికల్ సీజ్ చెయ్యడం దగ్గర నుండి వాలంటీర్లును అరెస్టు చేయడం వరకూ అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు.
నాటి పాలకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలు చూపించిన ప్రేమ నన్ను మరింత దృఢంగా మార్చింది. పాదయాత్ర ప్రతి అడుగులో ప్రజల కష్టాలు చూసాను, ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికీ నాకు గుర్తున్నాయి. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. హామీలు అన్ని క్రమ పద్ధతిలో అమలు చేస్తున్నాం. యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా- పరోక్షంగా భాగమైన ప్రతి ఒక్కరికీ, నన్ను ఆదరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు.” అని తెలిపారు.