పథకాల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో 2022-2023 ఆర్థిక సంవత్సరానికి చెందిన నీతి అయోగ్ రిపోర్ట్(NITI AYOG Report)పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దారుణంగా తయారైందన్నారు. అభివృద్ధి పనులు చేసి రాష్ట్ర సంపద పెంచాలని.. అప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవని తెలిపారు. నాయకుల అసమర్థత వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర ఆర్థికస్థితి కుంటుపడుతుందని వాపోయారు.
దీంతో అభివృద్ధికి నిధులు లేక, అప్పుల పాలై, ఆ భారం ప్రజలపై మోపాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి నాయకులు ముందుచూపుతో ఆలోచిస్తేనే ఆర్థికంగా బాగుపడతామని పేర్కొన్నారు. రాష్ట్రాలు బాగుంటేనే.. దేశం ఆర్థికంగా ఎదుగుతుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. ప్రభుత్వ కార్యాలయాలను సైతం తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. ఐదేళ్లలో వచ్చిన డబ్బంతా ఏం చేశారో తెలియడం లేదని చెప్పుకొచ్చారు.
విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన నిధులు పథకాలకు మళ్లించలేమన్నారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచింనని.. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నానన్నారు. ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగభృతి వంటి పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.