ఏపీ హైకోర్టు(AP Highcourt) సీనియర్ న్యాయవాది చల్లా ధనుంజయ(Challa Dhananjaya) అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొంది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
కాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి చెందిన ధనుంజయ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. 1983 నుంచి 1987 వరకు రాజమహేంద్రవరంలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. అనంతరం ప్రాక్టీసును హైకోర్టుకు మార్చారు. 2022లో హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు.