Friday, September 20, 2024
Homeహెల్త్Panipuri: పానీ పూరీ తిన్నా బరువు పెరగకూడదంటే..

Panipuri: పానీ పూరీ తిన్నా బరువు పెరగకూడదంటే..

పానీ పూరీ అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరుంటారు చెప్పండి? అయితే శరీర బరువు పెరగకుండా ఉండేలా ఇంట్లోనే వీటిని తయారుచేసుకోవచ్చంటున్నారు డైటీషియన్లు. బరువు తగ్గడం అంత సులభమైన విషయమేమీ కాదన్నది అందరికీ తెలుసు. లావు తగ్గడానికి చాలా కష్టపడాలి. శరీరంలో పేరుకుపోయిన్న కొవ్వు కరగడానికి తీసుకునే ఆహారం విషయంలో కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందులోనూ జంక్ ఫుడ్ కు మరీ దూరంగా ఉండాలి. అందుకే బరువు పెరగకుండా ఉండడం కోసం ఎంతో ఇష్టమైన పిజ్జా, బర్గర్లు, ఛాట్ ల వంటివాటికి దూరంగా ఉండాలి. పానీ పూరి కూడా వాటిలాంటిదే మరి. అందులోనూ బరువు తగ్గే డైట్ తీసుకునేవాళ్లు పానీ పూరికి తప్పనిసరిగా దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు, ఫిట్ నెస్ నిపుణులు చెప్తారు. అయితే పానీ పూరీ లో కొన్ని మార్పులు చేస్తే మీ వెయిట్ లాస్ డైట్ లో దాన్ని కూడా చేర్చవచ్చంటున్నారు కొందరు డైటీషియన్లు.

- Advertisement -

తక్కువ కాలరీలు ఉండేలా పానీ పూరీని తయారుచేసుకోవచ్చని వాళ్లు చెప్తున్నారు. పానీ పూరీని శరీర బరవు పెరగని రీతిలో, శరీరానికి ఆరోగ్యకరమైందిగా చేసుకోవచ్చని చెప్తున్నారు. పూరీని ఇంట్లో తయారుచేసుకోవడం ఒక టిప్. ఇంట్లో వీటిని చేసుకునేటప్పుడు తక్కువ నూనె వాడతాం. పైగా పరిశుభ్రమైన వాతావరణంలో వీటిని తయారుచేసుకుంటాం. అందువల్ల వాటిని తిన్నా ఆరోగ్యకరంగా ఉంటాము. వీధుల్లో లేదా స్టోర్స్ లో అమ్మే పూరీల విషయానికి వస్తే వాటిని ఎక్కువ నూనెలో వేగిస్తారు. వాటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ డైట్ లో ఉన్న వారికి ఇవి అస్సలు మంచిది కాదు.

ఈ పూరీలను ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ లో వేగిస్తే వాటికి పట్టే నూనె చాలా తక్కువగా ఉంటుంది. ఇంకో ఐడియా ఏమిటంటే ఈ పూరీలను ఇంట్లో అయితే బేక్ చేసుకోవచ్చు కూడా. డైటీషియన్లు చెప్తున్న ఇంకో టిప్ ఏమిటంటే సాధారణంగా పానీ పూరీల్లో ఫిల్లింగ్ గా బంగాళాదుంపను వాడుతుంటాం.అలా కాకుండా పానీ పూరీ ఫిల్లింగులో బంగాళాదుంపను వాడకుండా ఉండడం లేదా చాలా కొద్దిగా మాత్రమే ఉపయోగించడం వల్ల కూడా శరీరం బరువు పెరగదు. ఆరోగ్యం దెబ్బతినదు. ఇంకో టిప్ ఏమిటంటే బంగాళాదుంప స్థానంలో ఉడకబెట్టిన శెనగలను మెత్తగా పిండిలా చేసి దాన్ని పానీ పూరీలో ఫిల్లింగ్ గా నింపొచ్చు. ఈ శెనగల మిశ్రమంలో ప్రొటీన్లు బాగా ఉండడమే కాదు ఇది మంచి పోషకాహారం కూడా. పిజ్జా, బర్గర్ వంటి వాటితో పోలిస్తే పానీ పూరీ తక్కువ కాలరీలతో కూడినదైనా పానీ పూరీని పరిమితంగానే తినాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. పానీ పూరీలో ఉపయోగించే నీటిలో రకరకాల మసాలాలు, సుగంధద్రవ్యాలు వేస్తారు. అవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇంట్లోనే పానీ పూరీ చేసుకుంటే ఆ పానీలో నచ్చిన రీతిలో మసాలాలు వేసుకోవచ్చు.

ఉదాహరణకు పానీ పూరీలోని పానీని తయారు చేసేందుకు చింతపండు వాడతారు. ఇందులో ఐరన్ బాగా ఉంటుంది. ఇది శరీరంలోని హిమోగ్లోబిన్ ప్రమాణాలను పెంచుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేయడానికి తోడ్పడే పుదీనా, ఇంగువ, సోంపు, జీలకర్ర, బ్లాక్ సాల్ట్ , జల్జీరా లాంటివి పానీ పూరీకి వాడే పానీలో కలుపుతారు. ఇవి కడుపులో ఎసిడిటీ, ఉబ్బరం తలెత్తకుండా సంరక్షిస్తాయి. ఎందుకంటే ఈ ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు వెయిట్ లాస్ సాధనకు ఆటంకంగా నిలుస్తాయి.

సో…ఈ టిప్స్ పాటించి బరువు పెరగనివ్వని, రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీ పూరీలని మీరు ఇంట్లో ప్రయత్నించండి… తిని ఎంజాయ్ చేయండి…ఏమంటారు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News