ప్రజాగాయకుడు గద్దర్(Gaddar)పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డు(Padma Awards)ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విమర్శించిన సంగతి తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్‌కు ఎల్టీటీఈ తీవ్రవాదికి పెద్దగా తేడా ఏమి లేదని..అనేక మంది ప్రాణాలు తీసిన నరహంతకుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. నిషేధిత మావోయిస్టు సంస్థలో ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. తీవ్రవాదులకు కూడా పద్మ అవార్డులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారా అని నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గద్దర్‌పై అనేక కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.
కాగా గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలన్న ప్రభుత్వ డిమాండ్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్ట్ భావజాలం ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తామని వ్యాఖ్యానించారు. ఓ వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టేలా పాటలు పాడిన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో పద్మ అవార్డ్ ఇవ్వమని తేల్చి చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.