వైసీపీ ప్రభుత్వంతో తీవ్ర ఆరోపణలు, ఇబ్బందులు ఎదుర్కొన్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswara Rao)కు కూటమి ప్రభుత్వంలో వరుస ఊరటలు లభిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై గతంలో నమోదైన అభియోగాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఉద్యోగ సర్వీసు కాలంపై కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సస్పెన్షన్ కాలానికి వేతనం, అలవెన్సుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సస్పెన్షన్ కాలం ఎంతో లెక్కించి.. ఎంత మొత్తం ఇవ్వాలో అంత మొత్తం చెల్లించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం రెండు పర్యాయాలు సస్పెన్షన్ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఒకసారి.. 2022 జూన్ నుంచి 2024 మే వరకు రెండోసారి సస్పెన్షన్ వేటు వేశారు.