రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ-20లో టీమిండియాకు షాక్ తగిలింది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లండ్.. మూడో మ్యాచ్‌లో మాత్రం 26 పరుగుల తేడాతో విజయం సాధించి. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా చేతులెత్తేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 145 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్ 40 పరుగులు చేసి.. కాసేపు పోరాడినా మరోవైపు అతనికి సహకారం కరువైంది. అభిషేక్ (24), సంజు శాంసన్ (3), సూర్య కుమార్ (14), తిలక్ వర్మ (18), వాషింగ్టన్ సుందర్ (6), అక్షర్ పటేల్ (15), ధ్రువ్ జురెల్ (2) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్ 3 వికెట్లు తీశారు. కార్స్, ఆర్చర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్ (51) అర్ధ శతకంతో రాణించగా, మరో బ్యాటర్ లివింగ్స్టన్ (43) విలువైన పరుగులు చేశాడు. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. టీమిండియా ముందు ఇంగ్లండ్ 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌నకు విశ్రాంతిని ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు కల్పించింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ధాటిగా ఆడి.. మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీంతో సిరీస్ 2-1గా ఉంది. తర్వాతి రెండు మ్యాచ్‌లు జనవరి 31న పుణెలో, ఫిబ్రవరి రెండో తేదీన ముంబైలో జరగబోతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు సంజు శాంసన్ ఈ సిరీస్‌లో మరోసారి విఫలమయ్యాడు. మూడు మ్యాచుల్లో ఆయన ఆర్చర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. తొలి మ్యాచులో 26 పరుగులు చేయగా.. తర్వాతి రెండు మ్యాచుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. కొన్ని నెలల క్రితం అవకాశాలు రావట్లేదని బాధపడితే.. ఇప్పుడు ఛాన్స్ వచ్చినా వినియోగించుకోవట్లేదని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.