కుంభమేళాలో తొక్కిసలాట(Maha Kumbh Mela Stampede) జరిగిన నేపథ్యంలో మొత్తం 13 అఖాడాల్లో పవిత్ర ‘అమృత్ స్నానాలు’(Amrit Snan) రద్దు చేస్తూ అఖారాలు కీలక నిర్ణయంతీసుకున్నారు. దీనిపై నిర్మోహి అఖారా అధ్యక్షుడు మహంత్ రాజేంద్ర దాస్ మాట్లాడుతూ.. అందరూ రాజ స్నానానికి వెళ్ళబోతున్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీంతో అఖారా సభ్యులందరూ సామూహిక రాజ స్నానానికి వెళ్ళకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామని తెలిపారు .
ఇక సామూహిక స్నానాన్ని రద్దు చేశామని స్వామి చిదానంద సరస్వతి కూడా చెప్పారు. మరోవైపు అమృత స్నానాలు రద్దు చేసినట్లు అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి తెలిపారు. తొక్కిసలాట తర్వాత జునా అఖారా, ఆవాహన్ అఖారా, అగ్ని అఖారాలు కూడా స్నానాలను తాత్కాలికంగా వాయిదా వేశారు. పరిస్థితిని పరిశీలించిన తర్వాత అమృత స్నానంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సాధువులు సామాన్య ప్రజలతో పాటు స్నానాలు ఆచరిస్తున్నారు.
ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) భక్తులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రివేణి సంగమం ఘాట్ వద్దకు ఎవరూ రావొద్దని భక్తులకు సూచించారు. తమకు సమీపంలో ఉన్న ఘాట్ల వద్దే అమృత స్నానాలు ఆచరించాలని కోరారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఘాట్లను ఏర్పాటు చేశామన్నారు. మిగతా అన్ని ఘాట్లలో పరిస్థితి సాధారణంగా ఉందని తెలిపారు.