మహా కుంభమేళా (Kumbh Mela)లో మౌని అమావాస్య సందర్భంగా భక్తులు తాకిడి అంతకంతకు పెరుగుతూనే ఉందని సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు.బుధవారం తెల్లవారుజామున నుంచి అధికంగా భక్తులు తరలి వస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. రద్దీ కనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు ప్రచారం చేయవద్దన్నారు. స్నానాల ఘట్టాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కొంతమంది బారీకేడ్లను తోసుకుంటూ వచ్చారన్నారు. ఇప్పటికే గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.
కుంభమేళా పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా
కుంభమేళా వద్ద ప్రస్తుత పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రధాని మోదీ (PM Modi) ఇప్పటివరకు 4 సార్లు ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి 2గంటల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుందన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసిన భక్తులు వాటిని దాటాలని ప్రయత్నించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. సుమారు 10 కోట్ల మంది స్నానమాచరించేందుకు రావడంతో రద్దీ ఎక్కువగా ఉందన్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీ సీఎం యోగికి 4 సార్లు ఫోన్లు
ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం నుంచి నాలుగుసార్లు ఫోన్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఫోన్ చేశారని యోగి ఆదిత్య తెలిపారు. మృతుల గురించి సీఎం ఎలాంటి వివరాలు తెలియజేయలేదు కానీ పలువురు తీవ్రంగా గాయపడ్డారని మాత్రం తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.
‘నో వెహికల్ జోన్’గా త్రివేణీ సంగమం
మౌని అమావాస్య పురస్కరించుకొని త్రివేణీసంగమ ప్రాంతాన్ని కొన్ని రోజులపాటు ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాళ్ల గులాబీ పూలవర్షం కురిపించనున్నారు.
అధికారులు భక్తులకు కొన్ని ప్రత్యేక సూచనలు
భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని అధికారులు కోరారు. నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలని సూచించారు. స్నానాల తర్వాత గుంపులుగా గుమికూడి ఎక్కువసేపు ఉండవద్దన్నారు సోషల్ మీడియా వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కానీ కొందరు భక్తులు బారికేడ్లను దాటాలని ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుందన్నారు.