అక్రమ సంబంధాలు ప్రస్తుత రోజుల్లో పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర బంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు తప్పుల కారణంగా చిన్నారులు రోడ్డున పడుతున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా ఎంతో మంది ఒంటరిగా జీవిస్తున్నాయి. అయితే అక్రమ సంబంధం కారణంగా జన్మించిన పిల్లలకు ఎవరు తండ్రిగా ఉండాలి.. ఎవరు బాధ్యత వహించాలి..? అనేదానిపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
కేరళలోని కోచికి చెందిన మహిళ తన భర్తతో విడిపోయింది. అప్పటికే ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 1989లో ఆమెకు వివాహం జరిగింది. 1991లో కుమార్తె, 2001లో కుమారుడు జన్మించాడు. 2003లో ఆమె తన భర్తతో విడిపోయింది. అప్పటికే ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధంలో ఉంది. 2006లో ఆమె భర్తతో విడుకులు మంజూరయ్యాయి. విడాకులు మంజూరైన కొద్దిరోజులకే ఆమె కోచి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లింది. తన కుమారుడు నా మాజీ భర్తకు జన్మించలేదని.. నా కుమారుడు కడుపులో పడేకంటే ముందునుంచే వేరేవ్యక్తితో వివాహేతర సంబంధం కలిగిఉన్నానని.. తన కుమారుడి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంలో తండ్రిపేరు మార్చాలని మున్సిపల్ అధికారులను కోరింది. అధికారులు అందుకు నిరాకరించారు. దీంతో 2007లో స్థానిక కోర్టును ఆశ్రయించింది.
తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని నా కుమారుడికి తండ్రి అని నిర్దారించాలని స్థానిక కోర్టును కోరగా.. మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి, పిల్లాడికి డీఎన్ఏ పరీక్ష చేయాలని ఆదేశించింది. దీనిపై వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టులో ఆ మహిళకు చుక్కెదురైంది. పిల్లాడు కడుపులో పడిన సమయంలో భార్యాభర్తలు కలిసి లేరని నిరూపించగలిగితే వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి డీఎన్ఏ పరీక్ష చేసుకోవాలని ఆదేశించగలమని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఆ మహిళ కుమారుడు 2015లో కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. తనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయని, ఆ ఖర్చులను తన తల్లి భరించలేక పోతుందని, తనకు చట్టబద్దమైన తండ్రి నుంచి కూడా సహకారం లేదని పిటీషన్ లో యువకుడు పేర్కొన్నాడు. తన వైద్యం, చదువు ఖర్చుకోసం మూడో వ్యక్తి నుంచి భృతి ఇప్పించాలని పిటీషన్ లో కోర్టును కోరాడు. దీంతో యువకుడికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది.
కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో అతనికి చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిస్తూ యువకుడికి షాకిచ్చింది. పిల్లాడు కడుపులో పడిన సమయంలో సదరు మహిళతో భర్త, మూడో వ్యక్తి ఇద్దరూ కాంటాక్టులో ఉన్నారని భావించినా కుమారుడు మహిళ.. మాజీ భర్తకు సక్రమ సంతానమే అవుతాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో DNA పరీక్ష వ్యక్తిగత గోప్యతను భంగపరిచే అవకాశం ఉందని.. ఇది ఒక వ్యక్తి ప్రతిష్ట, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని కోర్టు అభిప్రాయపడింది. అక్రమ సంబంధ ఆరోపణలపై DNA పరీక్షలు చేయించడం ద్వారా వ్యక్తుల సామాజిక జీవితానికి హాని కలుగుతుందని కోర్టు పేర్కొంది.