మన దేశంలో తుమ్ముపై ఎన్నో నమ్మకాలు ఉన్నాయి.. ఎవరైనా ఏదైనా పని మీద బయటకు వెళ్లేప్పుడు తుమ్మితే ఆ పని అవ్వదని, అశుభమని భావిస్తుంటారు. దీంతో చాలా మంది ఆ సమయంలో తుమ్ము వచ్చినా బలవంతంగా ఆపేసుకోవాలని చూస్తుంటారు.. అయితే అలా బలవంతంగా తుమ్ము ఆపుకోకూడదని పెద్దలు చెపుతుంటారు. కొంత మంది చాలా సందర్భాల్లో తుమ్మును ఆపుకోడానికి ట్రై చేస్తుంటాం. ముఖ్యంగా అందరిలో ఉన్నప్పుడు, ఏదైనా క్లాస్ జరుగుతున్నప్పుడు.. పక్కవారు ఏమి అనుకుంటారనే భయంతో.. ఇలా చేస్తుంటారు. అయితే తుమ్మును బలవంతంగా ఆపుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి తుమ్ము ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. ముక్కు, గొంతులో ఏదైనా బాక్టీరియా, దుమ్ము కణాల్లాంటివి చేరినపుడు అత్యంత వేగంగా దాన్ని బయటికి పంపేందుకు శరీరం చేసే ప్రతిస్పందన తుమ్ము. ఒక నివేదిక ప్రకారం తుమ్మినప్పుడు ఇది గంటకు 100 మైళ్ల వేగంతో మీ ముక్కు నుంచి పదివేల బిందువులను విడుదల చేయగలదంట. తుమ్ము ముక్కు నుంచి కొన్ని సెకన్లలోనే.. దుమ్ము, ధూళీ, బ్యాక్టీరియాను తొలగించడానికి మన శరీర సహజ రక్షణ విధానం. తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తే ఈ చికాకులు, బ్యాక్టీరియా, దుమ్ము ముక్కులోనే ఉండిపోతాయి. వీటి కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. తుమ్ము ద్వారా వీటిని బయటకు పంపితే.. ఉపశమనం లభిస్తుంది.
తుమ్మును బలవంతంగా ఆపితే.. ముక్కు, చెవులు, కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగితే అసౌకర్యానికి దారితీస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా కర్ణభేరి పగిలిపోవడం, కళ్లలోని చిన్న రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాదు గొంతులోపల గాయం అయ్యే ప్రమాదం కూడా ఉందట.. అందుకే ఆ తప్పు అసలు చేయకూడదు. అంతేకాదు తుమ్ముని ఆపుకుంటే.. నాసికా భాగాల నుంచి గాలిని తిరిగి మీ చెవులకు మళ్లిస్తుంది. ఆ విషపదార్థాలతో కూడిన సూక్ష్మక్రిములు, శ్లేష్మం మీ మధ్య చెవికి పంపవచ్చు. ఇది ఇన్ఫెక్షన్కు కారణం అవుతుంది.
తుమ్ములు బలవంతంగా ఆపుకుంటే.. కర్ణభేరి పగిలిపోయే అవకాశం ఉంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ముక్కు, చెవుల యుస్టాచియన్ గొట్టాల ద్వారా కనెక్ట్ అవుతాయని వైద్యులు చెపుతున్నారు. తుమ్ము ఆపుకుంటే.. ముక్కులో ఒత్తిడి పెరుగుతుంది, ఇది యుస్టాచియన్ గొట్టాల ద్వారా చెవికి ప్రవహిస్తుంది. దీంతో కర్ణభేరి పగిలే అవకాశం ఉంది. అంతే కాదు టింపాటిక్ పొరకి రంధ్రం పడడం అంటే తీవ్రమైన చెవి పోటు వస్తుంది. (గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నావైద్యులను సంప్రదించడం ఉత్తమం.)