అమెరికాలో జరుగుతున్న ప్రమాదాల్లో.. భారతీయ విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఖైరతాబాద్‌కు చెందిన మహమ్మద్ వాజిద్ నాలుగు సంవత్సరాల క్రితం.. ఉన్నత చదువుల కోసం వెళ్లాడు. పేద కుటుంబానికి చెందిన వాజిత్ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూనే తన చదువు కొనసాగించాడు. కాగా బుధవారం చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాజిద్ మృతి చెందాడు.
ఇదిలా ఉంటే వాజిద్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డివిజన్ యువజన నాయకుడిగా కూడా పనిచేశారు. ఎన్ఆర్ఐ కాంగ్రెస్ మైనార్టీ విభాగంలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నడు. వాజిద్ మృతి పట్ల
కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అనిల్ కుమార్, పలువురు కాంగ్రెస్ నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహమ్మద్ వాజిద్ మృతదేహం అమెరికా నుంచి భారత్‌కు రప్పించేందుకు చర్యలు చేపట్టారు.
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు.. అమెరికాలో చనిపోతుండటం కలకలం రేపుతోంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ(25) అనే విద్యార్థి కూడా అమెరికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఉంటున్న అపార్ట్మెంట్ కింద సెల్లార్‌లోని కారులో వంశీ అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
అలాగే గతవారం అమెరికాలోని వాషింగ్టన్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీకి చెందిన యువకుడు రవితేజ మృతి చెందాడు. 2022 మార్చి లో అమెరికా వెళ్లిన రవితేజ ఇటీవలే ఎంఎస్ మాస్టర్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే జనవరి 19న గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు ఇలా చనిపోతుండటంతో అమెరికాలో ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.