Friday, January 31, 2025
HomeఆటInd vs Eng: భారత్, ఇంగ్లండ్‌ నాలుగో టీ20.. ఆ తప్పులు చేస్తే కష్టమే..!

Ind vs Eng: భారత్, ఇంగ్లండ్‌ నాలుగో టీ20.. ఆ తప్పులు చేస్తే కష్టమే..!

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా.. టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. మొదటి రెండు టీ20ల్లో విజయం సాధించి భారత్.. మూడో టీ20లో మాత్రం ఓటమి చవి చూసింది. అయితే శుక్రవారం జరిగే నాలుగో టీ20లో విజయం సాధించి తిరిగి గెలుపు బాట పట్టాలని చూస్తోంది భారత్. మరోవైపు మూడో టీ20లో గెలిచిన ఇంగ్లండ్.. ఇవాళ జరిగే నాలుగో మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్ సమం చేయాలని చూస్తోంది. దీంతో పూణేలో శుక్రవారం జరిగే నాలుగో టీ20 భారత్, ఇంగ్లండ్ జట్లకు కీలకం కానుంది.

- Advertisement -

భారత్ విషయానికి వస్తే.. గత ఏడాది సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన సంజు శాంసన్‌ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నిరాశపరుస్తున్నాడు. మూడు టీ20ల్లో వరుసగా విఫలం అవుతున్నాడు. ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పేలవ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో 0, 12, 14 పరుగులే చేశాడు. సంజు, సూర్య పుంజుకోవాల్సిన అవసరం ఉంది. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్‌ పాండ్యా ఫామ్‌లో ఉండడం భారత జట్టుకు కలిసి వచ్చే అంశం. ఇదిలా ఉంటే వెన్ను నొప్పి కారణంగా గత రెండు టీ20లకు దూరమైన రింకు సింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు. రింకు తుది జట్టులోకి వస్తే ధృవ్ జురెల్‌ తప్పుకోక తప్పదు.

గత మూడు మ్యాచులకు దూరంగా ఉన్న శివమ్ దూబె.. నాలుగో టీ20లో ఆడించే అవకాశం ఉంది. ఇటు భారత బౌలర్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మూడో టీ20లో ఆడిన మహ్మద్ షమీ.. పెద్దగా ప్రభావం చూపలేదు. రవి బిష్ణోయ్‌ భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. అక్షర్ పటేల్ కూడా పెద్దగా రాణించట్లేదు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మూడు మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. గత మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించిన భారత్.. ఈ సారి అర్షదీప్ సింగ్‌ను ఆడించే అవకాశం ఉంది.

ఇంగ్లండ్ విషయానికి వస్తే.. కెప్టెన్ జోస్ రాణిస్తున్నాడు. ఇక డకెట్, లివింగ్‌స్టన్‌ ఫామ్ అందుకోగా.. సాల్ట్, బ్రూక్‌ హిట్టింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రషీద్, కార్స్, ఆర్చర్, ఒవర్టన్‌ బాగా బౌలింగ్ చేస్తున్నారు. నాలుగో టీ20లో స్పెషలిస్టు స్పిన్నర్ రెహాన్‌ అహ్మద్‌ను ఆడించే అవకాశాలున్నాయి. అయితే పూణేలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తుంటే.. సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. మూడో టీ20లో భారత్ చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే.. టీమిండియా చిక్కుల్లో పడే అవకాశం ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News