పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) తీవ్రంగా ఖండించింది. రాష్ట్రపతి ప్రసంగంపై ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపింది.ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రసంగం సమయంలో రాష్ట్రపతి అలసిపోయిటన్లు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని పేర్కొంది. అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు ఆమెకు అలసట దరిచేరదని తెలిపింది. ఇలాంటి నాయకులకు భారతీయ భాష, యాసలతో పరిచయం లేకపోయి ఉండొచ్చని.. అందుకే రాష్ట్రపతి అలసిపోయినట్లు వాళ్లకు అనిపించొచ్చని వ్యాఖ్యానించింది. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం దురదృష్టకరమంది.
కాగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారు. ఆమె పేలవంగా మాట్లాడలేకపోయారు’’ అంటూ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఆదివాసీలు, గిరిజనులు అంటే తొలి నుంచి చులకన అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపదీ ముర్ము.. రాష్ట్రపతిగా ఉండటం కాంగ్రెస్ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుందని మండిపడుతున్నారు.