బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిప్పులు చెరిగారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ఫామ్ హౌస్‌లో ఉండి వచ్చినోళ్లకు సోధి చెప్పడం కాదని.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతా అని సవాల్ విసిరారు. ఏ ఊరిలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేశానో సభలో పెడతా. ఎవరి ఖాతాలో ఎంత డబ్బు వేశానో లెక్క చెబుతా. చిత్తశుద్ది, నిజాయితీ ఉంటే రా అసెంబ్లీకి అని ఛాలెంజ్ చేశారు.
దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అంటూ హామీలు ఇచ్చి మాట తప్పిన చరిత్ర కేసీఆర్‌ది అని విమర్శించారు. పదేళ్లు పాలించి ప్రజల దగ్గరకు వెళ్తే పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని.. అయినా కానీ కేసీఆర్‌కు బుద్ధి రాలేదన్నారు. కేసీఆర్ కోసం ప్రజలెవరూ బాధపడటం లేదని.. ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రూ.2లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ రూ.10లక్షలు, రైతు భరోసా పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.