కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) బడ్జెట్(Union Budget 2025) ప్రసంగం ముగించారు. లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నిర్మలమ్మ ప్రసంగం మధ్యాహ్నం 12.15 గంటలకు ముగిసింది. అంటే గంటా 15 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు.
ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ రూ.12లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారు. అలాగే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కిసాన్ కార్డుల పరిమితిని రూ.5లక్షల వరకు పెంచారు. దీంతో 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభించనుంది. ఇక చిన్న పరిశ్రమలకు ఇచ్చే రుణాలను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు.. స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.
గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్ కింద నమోదుచేసి పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. కేంద్రం నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుంది. బీమా రంగంలో ఎఫ్‌డీఐ(FDI) ప్రస్తుతం ఉన్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుకుతున్నట్లు వెల్లడించారు. రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు అందించనున్నట్లు చెప్పారు. ఇక కొత్త ఉడాన్ పథకం మరో 120 రూట్లలో అమలు చేస్తామన్నారు. 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యమన్నారు. వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ నుంచి ఊరట కల్పించారు. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించారు.