Saturday, February 1, 2025
HomeతెలంగాణKTR-Harish: కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్, హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం

KTR-Harish: కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్, హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తుందని మరోసారి బడ్జెట్(Union Budget)తో రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి 16 మంది ఎంపీలను పార్లమెంట్‌కు పంపిస్తే తెలంగాణకు గుండు సున్నా తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బిహార్, అంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూస్తే ప్రాంతీయ పార్టీలకున్న విలువ తెలుస్తుందన్నారు. ఇక రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి పోయింది తెలంగాణకు నిధులు తెచ్చేందుకు కాదని, ఢిల్లీకి మూటలు మోసేందుకేనని తెలిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తూన్న బడే భాయ్- చోటే భాయ్ అనుబంధంతో తెలంగాణకు నయా పైసా లాభం లేదని కేటీఆర్ మండిపడ్డారు.

- Advertisement -

ఇక మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పందిస్తూ.. “దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్ గారూ, దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరం. మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. 2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు. 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు? తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది” అని విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News