తల్లికి వందనం(Talliki Vandanam), అన్నదాత సుఖీభవ పథకాలపై ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక ప్రకటన చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు పాఠశాలలకు వెళ్లే లోపు తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసి తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మే నెల నుంచి అన్నదాఖ సుఖీభవ పథకం రూ.20వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి అనుకూలంగా మూడు విడతల్లో డబ్బులు ఇస్తామన్నారు.
ఇక 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. వైసీపీ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు అదనంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తుండడం శుభసూచకం అన్నారు. ఆరు నెలల్లోనే రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యమని బాబు తెలిపారు.