వసంత పంచమి అనేది వసంత ఋతువు ప్రారంభానికి సూచికగా జరుపుకునే ఒక హిందూ పండుగ. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పండుగను మాఘ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథినాడు జరుపుకుంటారు. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం, పసుపు రంగు పదార్థాలను తినడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల జ్ఞానం, వివేకం, సృజనాత్మకత పెరుగుతాయని నమ్ముతారు. అందుకే హిందువులు వసంత పంచమిని ప్రత్యేకంగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం వసంత పంచమిని ఫిబ్రవరి 3న జరుపుకుంటున్నారు. సూర్యోదయంతో పంచమి తిథి ఉండటంతో చాలా మంది ఫిబ్రవరి 3నే వసంత పంచమి జరుపుకుంటున్నారు. ఎంతో ముఖ్యమైన ఈ వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ రోజు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు. ఈ నేపథ్యంలో వసంత పంచమి రోజు ఏయే పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే పూజా సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.
వసంత పంచమి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులను ధరించకూడదట. ఇలా ధరించడం వలన సరస్వతి దేవిని అవమానించినట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు. ఎవరి నుంచైతే జ్ఞానం, విద్యాబుద్ధులను పొందారో వారిని అవమానించకూడదని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ రోజు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. వసంత పంచమి పండుగ అనేది పచ్చదనం, పంటలకు సంబంధించింది. అందుకే ఈ ప్రత్యేకమైన రోజు మొక్కలు పీకడం, చెట్లు నరకడం, తొలగించడం చేయకూడదు.
ముఖ్యంగా ఈ రోజున వివాదాలు, తగాదాలు అస్సలు పడకూడదట. ఇలా చేస్తే సరస్వతీ దేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈరోజున ఇలా చేస్తే ఇంట్లో సమస్యలు మొదలవుతాయని, కెరీర్ పరంగాను ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ఇక ఆహారం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు అంటున్నారు. సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. పండ్లు, కాయలు, పాలు మాత్రమే తీసుకోవాలని సూచిస్తారు. అంతేకాకుండా వివాహితులు, యువకులు బ్రహ్మచర్యం పాటించాలని చెబుతున్నారు. ఈ పరిహారాలు పాటిస్తే సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.