పాకిస్తాన్ బాంబుదాడులో మరోసారి రక్తమోడింది. పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు. దీంతో పాక్ ఆర్మీ అలర్ట్ అయ్యింది. తాజా పరిణామాలను సమీక్షించేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆ ప్రాంతానికి వెళ్తారు. బలూచిస్తాన్ సీఎం సర్పరాజ్ బుగ్టి ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన సైనికుల అంత్యక్రియల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. గాయపడ్డవారిని పరామర్శించారు. ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా పాక్ ఆర్మీ ఆరోపిస్తోంది. బలూచిస్తాన్ ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులకు బుద్ధి చెబుతామంటున్నారు.
మరోవైపు ఉగ్రవాదులను మట్టుబెడతామని పాక్ ఆర్మీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రజల భద్రత, శ్రేయస్సు కోసం సైన్యం దృఢ సంకల్పంతో ఉందని చెబుతున్నారు. తాజాగా బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాదులు మరణించారని సైన్యం తెలిపింది. హర్నాయ్ జిల్లాలో జరిగిన ఒక ఆపరేషన్‌లో.. పాక్ సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. 11 మంది ఉగ్రవాదుల్ని హతమార్చి, వారి స్థావరాలను నాశనం చేసినట్లు ఆర్మీ తెలిపింది. కలత్‌లోని మాంగోచర్ ప్రాంతంలో కూడా ఉగ్ర చర్యలను అడ్డుకున్నట్లు భద్రతా దళాలు తెలిపారు.
ఈ ఘర్షణల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారని.. మొత్తం 24 గంటల్లో 23 మందిని చంపినట్లు ప్రకటించారు. అయితే ఈ దాడులపై ఏ ఉగ్రవాద సంస్థా ఇంకా బాధ్యత వహించలేదు. మరోవైపు వరుస దాడుల్లో పాక్ ఆర్మీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో 18 భద్రతా సిబ్బంది చనిపోయారు. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లో గత కొంత కాలంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ ప్రాంత విముక్తి కోసం.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ గత కొంత కాలంగా పోరాడుతోంది.
ముఖ్యంగా పాక్ సైనికులు, అధికారుల్ని టార్గెట్ చేస్తోంది. పాక్‌లో అతిపెద్ద ప్రావిన్స్‌గా ఉన్న బలూచిస్తాన్ నుంచే చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ వెళ్తోంది. ఈ ప్రాంతంలోనే చైనా తన వ్యూహాత్మక పోర్టు గ్వాదర్‌ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుని కూడా బీఎల్ఏ టార్గెట్ చేస్తోంది. ఇక ఖైబర్ ప్రాంతంలో పాక్ తాలిబాన్లు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. గత ఏడాది కాలంలో పాక్ వ్యాప్తంగా 444 ఉగ్రదాడులు జరిగాయి. ఇందులో 685 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.