ప్రముఖ యోగా గురువు బాబా రాంవేద్(Baba Ramdev)కు బిగ్ షాక్ తగిలింది. రాందేవ్‌తో పాటు ఆయన సహచరుడు, పతంజలి(Patanjali) ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీకి చెందిన ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రచారం చేసిందని ఆరోపణలొచ్చాయి. దీనిపై కేరళ రాష్ట్ర డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఫిబ్రవరి 1న విచారణకు స్వయంగా హాజరుకావాలని జనవరి 16న వీరికి పాలక్కాడ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే వీరు విచారణకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కాగా పతంజలి అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీకి చెందిన పది ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే వేటు వేసింది. ఆ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు ప్రకటన ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ లైసెన్స్ రద్దు చేసింది. తాజాగా వీరిద్దరికి నాన్ బెయిల్‌బుట్ వారెంట్ జారీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.