భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ లో ఫైనల్ ఫైట్ నేడు జరగనుంది. ఇప్పటికే 3-1తో సిరీస్ సొంతం చేసుకున్న భారత్.. ముంబై వేదికగా జరిగే చివరి మ్యాచ్ లో కూడా ఇంగ్లండ్ ను మట్టి కరిపించాలని భావిస్తోంది. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ టీమిండియా కంటే.. ఇంగ్లండ్ కు ముఖ్యమైనది. సిరీస్ ఎలాగూ పోయింది కాబట్టి కనీసం ఇందులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లీష్ టీమ్ భావిస్తోంది. మరోవైపు సూర్య సేన ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి.. ఘనంగా సిరీస్ ముగించాలని చూస్తోంది.
భారత బౌలర్లు రాణిస్తున్నా.. బ్యాటింగ్ విభాగం మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్, ఓపెనర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నారు. ఇక సొంత మైదానంలో అయినా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లో సూర్య కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. అయితే వాంఖడే సూర్యాకు ఎంతో అచ్చివచ్చిన గ్రౌండ్.. ఇక్కడ ఆడిన టీ20ల్లో సూర్య 1493 పరుగులు సాధించాడు. అదే జోరును ఈ మ్యాచ్‌లో పునరావృతం చేసి ఫామ్‌ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక సంజు శాంసన్ పేసర్లు ఉడ్, ఆర్చర్ బంతులను ఆడలేకపోతున్నాడు. షార్ట్‌పిచ్ బంతులకు అవుటవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బౌలింగ్‌లో షమిని తుదిజట్టులోకి తీసుకునే చాన్సుంది. మరోవైపు నాలుగో టీ20లో గెలిచేందుకు అవకాశాలు వచ్చినా ఇంగ్లండ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత్‌ను బౌలర్లు ఆరంభంలో కట్టడి చేసినా డెత్ ఓవర్లలో చేతులెత్తేయడం కొంప ముంచింది. ఛేదనలో ఓపెనర్లు అద్భుతంగా ఆడినా.. మధ్య ఓవర్లలో తడబడ్డారు. మొత్తానికి సిరీస్ ను ఘనంగా ముగించాలని టీమిండియా, గౌరవంగా ముగించాలని ఇంగ్లాండ్ చూస్తున్నాయి.