పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు వైసీపీ(YCP) అధిష్టానం విప్(Whip) జారీ చేసింది. ఇటీవల ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీకి సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చేజారిపోకుండా అప్రమత్తమైన వైసీపీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ నేతల బృందం కలిశారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్యెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, రుహుల్లా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఉన్నారు..
కాగా తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్‌లకు సంబంధించి డిప్యూటీ మేయర్లు.. నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపల్ చైర్ పర్సన్స్, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్ పర్సన్స్ పదవుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండటంతో ఆయా పదవులను కైవసం చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది.