సూర్యాపేట జిల్లాలో మిస్ అయిన(Students Missing) ఆరుగురు గురుకుల విద్యార్థుల ఆచూకీ లభించింది. విద్యార్థులు విజయవాడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు ఏం జరిగిందంటే.. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమలిపురిలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. అయితే ఈ పార్టీలో పది మంది విద్యార్థులు మద్యం తాగారు. అనంతరం మద్యం మత్తులో ఘర్షణకు దిగారు.
విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించడంతో ఎవరికి చెప్పకుండా పరారయ్యారు. వెంటనే కోదాడ రూరల్ పొలీసులకు ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు 10 గంటల్లోనే మిస్ అయిన పిల్లల ఆచూకీ కనిపెట్టారు. విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి నుంచి విద్యార్థులను క్షేమంగా కోదాడ తీసుకొచ్చారు. దాంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.