ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్యతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతను తన సహచరుడితో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో కాల్ (SI Audio Call) ఇప్పుడు వైరల్ అవుతోంది. తన సహచర సిబ్బంది తనను అనవసరంగా కొన్ని విషయాల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే ఆ ఇద్దరూ తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. పిల్లలను తలచుకుంటే బాధేస్తోందని తెలిపారు.
రేంజికి రిపోర్టు చేస్తే కృష్ణా జిల్లాకి పంపిస్తారని అక్కడికి వెళ్లడం ఇష్టం లేదని బాధపడ్డారు. నువ్వేమీ పిచ్చి పనులు చేయకు.. నువ్వు లేకపోతే భార్యాపిల్లలను ఎవరు చూస్తారని సహచరుడు వాదిస్తున్నారు. నీకు అన్యాయం జరిగిందని.. నువ్వు చనిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? అని బతిమిలాడారు. అయినా కానీ తన వల్ల కాదని ఏడుస్తూ ఫోన్ పెట్టేశాడు ఎస్సై మూర్తి. ఇందుకు సంబంధించిన ఆడియో కాల్ వైరల్‌గా మారింది.