మరో రెండు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు(Delhi Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇక ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ అభ్యర్థుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) ఢిల్లీలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఇక తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం హాఫ్ ఇంజన్ సర్కార్ అంటూ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. ఢిల్లీ రెండు రకాల కాలుష్యాలతో బాధపడుతోందన్నారు. ఒకటి వాయు కాలుష్యమైతే, రెండోది రాజకీయ కాలుష్యమని పేర్కొన్నారు. గత పదేళ్లుగా పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోందని.. కేజ్రీవాల్ ప్రజల్నికలుషితం చేయాలని చూస్తున్నారన్నారు. ఢిల్లీలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపిస్తోందని.. యమునా నది మొత్తంగా కలుషితమైందన్నారు. బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రజలు ఆలోచించి కమలం గుర్తుకు ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆప్ పాలనలో జరిగిన లిక్కర్ స్కాం నీచమని విమర్శించారు.
అనంతరం 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియా(Arvind panagariya)తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్లలో రంగాల వారీగా జరిగిన నష్టంపై ప్రజంటేషన్ ఇచ్చారు. 2024-29 మధ్య రూ.10లక్షల కోట్ల అప్పులు తెచ్చారని.. రూ.లక్షన్నర కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టారని వివరించారు. ఏపీని ఆర్థికంగా గట్టెక్కించే చర్యలకు సహకరించాలని కోరారు.