దేశంలోని నిరుద్యోగ సమస్యపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక ప్రసంగం చేశారు. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని.. భారత్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయామని తెలిపారు.
‘మేకిన్ ఇండియా’(Make In India) ఆలోచన మంచిదే కానీ.. దీనిని సరిగా వినియోగించుకోవడంలో ప్రధాని మోదీ(PM Modi) విఫలమయ్యారని విమర్శించారు. ఉత్పత్తి రంగంలో భారత్ నిలదొక్కుకోకపోవడం వల్ల చైనా కంపెనీలు దేశంలో మకాం వేశాయని పేర్కొన్నారు. దీంతో చైనా ఉత్పత్తులపై భారత్ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ఉత్పత్తుల రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉందన్నారు. అాగే ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందన్నారు.