ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. తాజాగా 87 ప్లస్ కిలోల కేటగిరీలో విజయనగరం జిల్లాకు చెందిన టి.సత్యజ్యోతి(Sathya Jyothi) కాంస్యం సాధించింది. దీంతో ఆమెకు సీఎం చంద్రబాబు(Chandrababu) అభినందనలు చెబుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“ఉత్తరాఖండ్ లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో 87 ప్లస్ కిలోల వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో కాంస్యం సాధించిన విజయనగరంకు చెందిన సత్యజ్యోతికి అభినందనలు. నీకు మరింత శక్తి కలగాలని కోరుకుంటున్నాను అమ్మా! మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ తెలిపారు.
మంత్రి లోకేశ్ కూడా ఆమెకు అభినందనలు తెలియజేశారు. “నీ కఠోర శ్రమ, అంకితభావం, స్ఫూర్తి మాకందరికీ ప్రేరణ. అడ్డంకులను అధిగమించి వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో ఎదగడం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. విజయాలతో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే పురుషుల విభాగం 67 కిలోల కేటగిరీలో నీలం రాజు, మహిళల 71 కిలోల విభాగంలో పల్లవి స్వర్ణ పతకాలు సాధించారు. వీరిద్దరు కూడా ఏపీకి చెందిన వారు కావడం విశేషం.