ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు.. భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ కిక్కిరిసి పోయింది. ఈ క్రమంలోనే మహా కుంభమేళాలో ఇవాళ వసంత పంచమి సందర్భంగా అమృతస్నానాల కోసం రెట్టింపు సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. ఫిబ్రవరి 3 సోమవారం తెల్లవారుజాము నుంచే త్రివేణీసంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేశారు.
ఇప్పటి వరకు కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా.. ఇవాళ వసంత పంచిమి కారణంగా భక్తులు అంతకంతకు రెట్టింపుగా తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు గంగా, యమునా , పౌరాణిక సరస్వతి సంగమం దగ్గర సుమారు రెండు కోట్ల మంది భక్తులు పుణ్య స్నానం చేశారని యూపీ సర్కార్ తెలిపింది. రాత్రి వరకు దాదాపు ఐదు కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 34.97 కోట్ల మంది భక్తులు వచ్చారని వెల్లడించింది.
ఇక మౌని అమవాస్య రోజున జరిగిన తొక్కిసలాట తర్వాత యోగి సర్కార్ అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడే పోలీస్ బందోబస్తును పట్టిష్టం చేశారు. ఆరోజు అత్యధికంగా ఎనిమిది కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానాలు చేశారు. మకర సంక్రాంతి జనవరి 14 నాడు 3.5 కోట్ల మంది.. జనవరి 30, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు కోట్ల మందికి పైగా భక్తులు, పౌష్ పూర్ణిమ జనవరి 13 నాడు 1.7 కోట్ల మంది స్నానాలు చేశారు.