సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అంటారు. సకల ప్రాణులకూ ఆరోగ్యాన్నిచ్చే దైవం ఆ ఆదిత్యుడు. సూర్యుడు ఆవిర్భవించిన రథ సప్తమి విశేషమైన పండుగగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. సూర్యోపాసన చేయదలచిన వాళ్లు షష్ఠి నాడు ఒకేపూట భోజనం చేసి.. సప్తమి నాడు ఉదయాన్నే ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రాగి ఆకులను తల, హృదయం, భుజాలు, మెడ మీద ఉంచుకొని స్నానం చేస్తే మంచిదని పెద్దలు సూచించారు.
సూర్యకిరణాల్లోని నిరోధకతను జిల్లేడు ఆకులు ఆకర్షిస్తాయి. అవి శరీరంపై ఉంచి స్నానం చేయడం వల్ల.. శక్తిని శిరస్సులోని బ్రహ్మ రంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపజేసి నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం. సూర్యుడికి ఇష్టమైంది జిల్లేడాకు. అందుకే దానిని అర్కపత్రం అంటారు. జిల్లేడుతోపాటు చిక్కుడాకులకు కూడా సూర్యరశ్మిని ఆకర్షించి, ఇముడ్చుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని ప్రకృతి శాస్త్రం చెబుతున్నది. జన్మజన్మలుగా చేసిన శోక, రోగ, పాపాలను పోగొట్టాలనీ, మనో వాక్కాయాలతో అజ్ఞానం వల్ల చేసిన ఏడు విధాలైన పాపాలను, రోగాలను తొలగించాలని సూర్య భగవానుణ్ని కోరుతూ రథసప్తమి నాడు స్నానం చేయాలి.
సూర్యారాధనలో భాగంగా చిక్కుడు కాయలతో రథం చేసి, అందులో సూర్యుణ్ని ఆవాహనం చేసి షోడశ ఉపచారాలలో పూజించాలి. పాయసం, పొంగలి చేసి నివేదనగా సమర్పించాలి. పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి నివేదించడం చేస్తుంటారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆ పత్రంలోని ఔషధ గుణాలు మనకు మేలు చేస్తాయని పెద్దలు చెబుతుంటారు. రథ సప్తమి సందర్భంగా.. సూర్యుడితోపాటు సౌరమండలం అంతర్గతంగా ఉన్న దేవతలకు, పితృదేవతలకు అర్ఘ్య ప్రదానం అద్భుత ఫలితాలు ఇస్తుందని చెబుతుంటారు. సూర్యోపాసనలో ముఖ్యమైన అంశం సూర్య నమస్కారాలు. సూర్యోదయ సమయంలో భానుడి కిరణాలు శరీరానికి తాకే విధంగా చేసే యోగాసనాలు మనసును, శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతాయి.