మహారాష్ట్రలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సీయం కేసీఆర్ ప్రకటించారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో కో ఆర్డినేటర్లను నియమించి పార్టీ విస్తరణకు పక్కా ప్రణాళికలతో ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వరకు అభ్యర్థుల ఎంపిక చేసి, ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, ప్రజల అకాంక్ష మేరకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమయత్తం అవుతుందని స్పష్టం చేశారు.
సీయం కేసీఆర్ నాందేడ్ సభ తర్వాత మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య మద్ధతు లభిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ తొలినాళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుంధుభి మోగించిందని, ఆదే స్పూర్తితో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.