సొరకాయ, పొట్లకాయ, బాటిల్ గార్డు (bottle gourd) అని దీనిని పిలుస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దీనిని ఎక్కువ శాతం సొరకాయ అని పిలుస్తుంటాం. దీనిని మనం మన అభిరుచికి తగ్గట్టుగా వండుకుంటూ ఉంటాం. కొంత మంది సైడ్ డిష్ గా వండుకుంటారు. మరికొంతమంది పులుసు కూరలు వండుకుంటారు. ఇలా ఎవరికి నచ్చిన పద్దతుల్లో వారు రుచిగా ప్రిపేర్ చేసుకుని అన్నం లేదా చపాతీ, రోటిల్లో తింటారు.
ఇలా వండే సమయంలో సొరకాయను తొక్కను తీసేసి వండుతుంటారు. ఇలా ఆ తొక్కతో కూడా రుచికరమైన వంటను చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ఈ సొరకాయ తొక్కలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ హెడ్ ఎడ్వినా రాజ్ వివరించారు. “ ఈ తొక్కలో డైటరీ ఫైబర్ ఉంటుందని చెప్పారు. ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుందన్నారు. అంతే కాదు ఈ తొక్కను వంట వండుకుని తినటం వల్ల బరువును కూడా అదుపులో ఉంచేందుకు సహాయపడుతుందని చెప్పారు. ఈ సొరకాయలో ఎక్కువగా ఆరోగ్యాన్ని పెంచే యాంటీఆక్సిడెంట్లు మరియు అవసరమైన విటమిన్‌లను కూడా కలిగి ఉంది” అని ఆమె చెప్పారు.
చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సి.వి. ఐశ్వర్య మాట్లాడుతూ సొరకాయ తొక్కను బాగా ఉడికించి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు.
ఇందులో ఫైబర్ ఉండటంతో త్వరగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుందన్నారు. తద్వారా జీర్ణక్రియకు ప్రక్రియ మెరుగుపడుతుందన్నారు. ఈ సొరకాయలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు కూడా ఉన్నాయన్నారు. శరీర ఒత్తిడి మరియు ఎక్కడైనా వాపులుంటే తగ్గిస్తాయన్నారు. ఇందులో పొటాషియం, విటమిన్ సి చాలా సమృద్దిగా ఉంటాయన్నారు. ఇది ప్రేగు ఆరోగ్యానికి మరియు మలబద్ధకాన్ని నివారిస్తుందని ఆమె చెప్పారు.
మరి ముఖ్యంగా కొంత మంది ఇన్ని ప్రయోజనాలున్నాయని సొరకాయ జ్యూసుని అధికంగా తీసుకుంటూ ఉంటారన్నారు. అలాంటి వారు జాగ్రతగా ఉండాలి నిపుణులు సూచిస్తున్నారు. ఈ జ్యూస్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు తగ్గుతాయని, చెప్పారు. తద్వారా నీరసంగా ఉండటం, అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఐశ్వర్య సూచించారు.
మరి కొంతమంది వ్యక్తులకు ఈ పొట్లకాయ పడకపోవచ్చన్నారు. ఇది దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పారు. వీరు డాక్టర్ల సూచనల మేరకు ఈ సొరకాయను ఆహారంలో చేర్చుకోవచ్చన్నారు. మీరు ఈ సొరకాయ తొక్కలు పడేసే బదులు దానితో వంట చేయడాన్ని ప్రయత్నించండని చెబుతున్నారు. ఈ తొక్కలు సొరకాయలో కంటే ఎక్కువగా పోషక విలువలు ఉంటాయని చెబుతున్నారు.
*ఈ సొరకాయ తొక్కలతో ఇలా వంట చేయండి*
ముందుగా బాగా పండిన ఓ మంచి సొరకాయను తీసుకోండి. దానిని శుభ్రంగా నీటితో కడగాలి. ఆ తర్వాత దానిపై ఉన్న తోలును తీసి పక్కన పెట్టుకోవాలి.
ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు మరియు పచ్చిమిర్చి వేయాలి. సొరకాయ తొక్కను వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు జీలకర్ర వేసి ఉడికించాలి. కాస్తా బాగా ఉడికిన తర్వాత అదనపు రుచి కోసం తురిమిన కొబ్బరి లేదా వేయించిన నువ్వులు వేసి తిప్పుకోవాలి. అంతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరి. ఈ రిసిపిని వేడివేడిగా అన్నంలో లేదా చపాతిలో తింటే చాలా బాగుంటుందని అంటున్నారు. చూశారుగా ఇకపై సొరకాయ తొక్కలు పడేయకండి.