తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు(BRS MLAS) అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో..? లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులపై స్పందించిన ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు సమయం అడుగుతామని తెలిపారు.
కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కౌశిక్ రెడ్డి పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా కాక రేపుతున్న ఫిరాయింపుల వ్యవహారంలో ఫిబ్రవరి 10వ తేదీన జరగనున్న సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.