తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలికి పార్టీ విప్‌లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ప్రకటించారు. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్(KP Vivekananda Goud), మండలిలో విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Satyavati Rathod)ను నియమించారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించిన నేపథ్యంలో పార్టీ విప్‌లను ప్రకటించడం గమనార్హం.
కాగా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 39 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 8, మజ్లిస్ 7స్థానాల్లో, సీపీఐ ఒకచోట గెలుపొందిన సంగతి తెలిసిందే. 39 ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇక శాసనమండలి పక్ష నేతగా మాజీ స్పీకర్ జి.మధుసూధన చారి కొనసాగుతున్నారు. అయితే కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానున్న నేపథ్యంలో పార్టీ విప్‌లను ప్రకటించడం చర్చనీయాంశమైంది.