భారత్-పాకిస్థాన్(IND vs PAK) క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు.. పాఠశాలలు, ఆఫీసులు ఎగ్గొట్టి మరి టీవీలకు అతుక్కుపోతారు. మరికొంతమందైతే ఆ రోజు స్టేడియంలతో ఎలాగైనా మ్యాచ్ చూడాలని తపనపడుతుంటారు. ఎందుకంటే అక్కడ జరిగేది క్రికెట్ మ్యాచ్ కాదు.. నువ్వా నేనా అనే రణభేరీ. తమ దేశం గెలవాలంటే తమ దేశం గెలవాలని కోట్లలో పందేలు, దేవుళ్లకు మొక్కులు.. అబ్బో దాయాదుల పోరు అంటే ఆ మజానే వేరు. తాజాగా అలాంటి ఉత్కంఠ పోరును చూసేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.
ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 23న జరగనుంది. దీంతో టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయగానే నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. స్టేడియం సామర్థ్యం 25,000 కాగా.. టికెట్ల కోసం సుమారు 1,50,000 మంది పోటీపడినట్లు సమాచారం. టోర్నీలో ఇతర మ్యాచ్‌ల టికెట్లన్నీ రూ. 2500 నుంచి ప్రారంభమైతే.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలు మాత్రం రూ.10 వేల నుంచి రూ. 1.20 లక్షలుగా ఉండటం గమనార్హం.అయినా కానీ టికెట్లు అమ్ముడుపోవడం ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ క్రేజ్‌ను తెలియజేస్తుంది.
కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. 19 రోజుల పాటు 15 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్ Aలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తపడనున్నాయి. భారత్ ఆడే లీగ్ మ్యాచ్‌లతోపాటు సెమీఫైనల్, ఫైనల్ (క్వాలిఫై అయితే) దుబాయ్‌లోనే నిర్వహిస్తారు. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది