తెలంగాణలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యమా.. ఎమర్జెన్సీ పాలనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై ఇండ్లను కూల్చివేసిన ఘటనలో బాధితుల గోడు వీడియోను ఈమేరకు పోస్టు చేశారు. ఈ వీడియోలో అధికారులు ఇల్లు కూల్చేస్తుంటే వృద్ధ దంపతులు తమకు ఉన్న గూడు కూల్చేస్తే ఎలా బతకాలంటూ పోలీసులను వేడుకుంటూ రోధించారు. వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోగా ఆసుపత్రికి తరలించారు.
“కూల్చివేతలు..కాల్చివేతలు..అణచివేతలు..ఆక్రమణలు..అరెస్టులు..జైళ్లు అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుంది. నిర్భంధం..నియంతృత్వం..పేదల వేదల అరణ్య రోదన. కట్టుకున్న గూడు..కండ్ల ముందే కూలితే..రెక్కల కష్టం..రెప్పపాటులో ఒరిగిపోతే..కంటికిరెప్పలా..కాపాడాల్సిన సర్కారు..కాళ్ల కింద కర్కశంగా నలిపేస్తుంటే..ఇది ప్రజాపాలన అంటారా ? ప్రతీకార పాలన అంటారా ? జాగో తెలంగాణ జాగో” అని కేటీఆర్ నిలదీశారు.