దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi assembly elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకున్నారు. ఇక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,09,955 మంది ఉద్యోగులు పాల్గొనగా.. 68,733 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయగా.. భద్రతా విధుల్లో కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 220 కంపెనీలను మోహరించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపర్చేందుకు ఢిల్లీలోని 11 జిల్లాల్లో స్ట్రాంగ్ రూములు, లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.