ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉత్తర్వులు ఇవ్వాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. గత నెలలోనే తెలుగులో జీవో జారీ చేయాలని నిర్ణయించగా.. సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. తాజగా ఈ ప్రక్రియను రాష్ట్ర హోంశాఖ ప్రారంభించింది. ఓ ఖైదీ పెరోల్‌కు సంబంధించిన జీవోను తెలుగు భాషలో విడుదల చేసింది.
ఇక నుంచి ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ప్రతి జీవో తొలుత ఇంగ్లీషులో విడుదల కానుంది. ఆ తర్వాత రెండు రోజుల్లోపు అదే జీవోను తెలుగు భాషలో జారీ చేయనున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాలు, ఉత్తర్వులు ప్రజలకు సులభంగా అర్థం కానున్నాయి. ప్రభుత్వం నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.