విశాఖ వాసుల దశాబ్దాల కల నెరవేరే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విశాఖ రైల్వే జోన్(Vizag Railway zone) ఏర్పాటుకు చకచకా ఫైళ్లు కదులుతున్నాయి. ఇప్పటికే విశాఖ కేంద్రంగా నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో విశాఖ కేంద్రంగా రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని 410 కిలోమీటర్లుగా రైల్వే శాఖ నిర్ణయించింది.
రైల్వేశాఖ ఉత్తర్వులతో ప్రజల ఆకాంక్ష నెరవేరిందని వైజాగ్ ఎంపీ భరత్ తెలిపారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని పేర్కొన్నారు. ఇది విశాఖ రైల్వే అభివృద్ధిలో చరిత్రాత్మక ముందడుగు అని అభివర్ణించారు. వాల్తేరు డివిజన్‌ను విశాఖ డివిజన్‌లో కలడపం హర్షణీయమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.