ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా మల్లన్న వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇటీవల బీసీ గర్జన సభలో రెడ్డి కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలతో పాటు ఇతర పార్టీల రెడ్డి నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉండగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వే నివేదిక పేపర్లను తన ఛానల్ లైవ్లో తగలబెట్టడం సంచలనంగా మారింది. దీంతో మల్లన్న వ్యవహారంపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉంది.
తాజాగా ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మరోసారి తీవ్రంగా స్పందించారు. ఎంతటివారైనా పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ నియమాలు పాటించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీలో ఎమ్మెల్సీ , ఎంపీ, మంత్రి అయినా క్రమశిక్షణకు లోబడే ఉండాలన్నారు. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో అది చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గురువారం జరగబోయే పార్టీ మీటింగ్లో ఈ వ్యవహారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
కులగణన, ఎస్సీ వర్గకరణతో బీసీ, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీసీ కులగణన జరిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ చేయని ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసిందని.. అభినందించాల్సింది పోయి విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విమర్శలకు బదులు సలహాలు, సూచనలు చేస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు.