ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సారి భారీ స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యింది. ఓటర్లు ఉదయం నుంచి పోటెత్తారు. సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ లు ఢిల్లీలో తమదే విజయం అంటున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, అధికారాన్ని నిలుపుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఇక 25 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారం అధికారం సొంతం చేసుకుంటామని బీజేపీ.. గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్.. తిరిగి అధికారంలోకి వస్తామని భావిస్తున్నాయి.
ఇక పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. ఈసారి అధికారం మాత్రం బీజేపీదే అని సర్వేలు చెబుతున్నాయి. జాతీయ మీడియా కూడా బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు. రెండో స్థానంలో ఆప్, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని అంటున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా అర్ధమవుతుంది. ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేస్తున్నారు.
తాజాగా సర్వేలపై ఆప్ స్పందించింది. సర్వేలను ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిపారేసింది. ఢిల్లీలో ఆప్‌కు ఇది నాలుగో ఎన్నిక అని.. ప్రతిసారీ ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని చెప్పుకొచ్చాయని.. మరోసారి ఇప్పుడు కూడా అలానే చెబుతున్నాయని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారని గుర్తుచేశారు. ఫలితాలు ఆప్‌కు అనుకూలంగా వస్తాయని.. తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆప్ నాయకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.